News

సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ


కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పశువులను వధించడం కోసం వాటిని సంతలలో అమ్మడంపై దేశవ్యాప్తంగా విధించిన నిషేధాజ్ఞలను సుప్రీంకోర్టు మంగళవారం నిలిపేసింది. మే 23న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆవులు, ఎద్దులు, దున్నపోతులు, గేదెలు, ఒంటెలను వధించడం కోసం అమ్మకూడదని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపిస్తూ కేంద్ర ప్రభుత్వం పాత నోటిఫికేషన్‌ను ప్రస్తుతం పునఃపరిశీలిస్తోందని, ఆగస్టు చివరికల్లా కొత్త నిబంధనలను జారీ చేయాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. అందువల్ల ప్రస్తుతం ఎటువంటి ఆదేశాలను జారీ చేయవద్దని కోరారు. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జీవనోపాధిని అనిశ్చితికి గురి చేయడం సరికాదని తెలిపింది.